తాజా కథలు @ CCK

సాహసవీరుడు

2015-06-03 01:05:01 చిన్నారుల కథలు
చిన్నతనంలోనే తల్లితండ్రులను పోగొట్టుకున్న మనవడికి వీరయ్య అనిపేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది పాపాయమ్మ. చనిపోయిన భర్తలాగా తన మనవడు గొప్ప ధైర్యశాలి కావాలని ఆమె ఆశపడేది. అయితే, బాలారిష్ట రోగాలతో బలహీనంగా పెరిగిన వీరయ్య పిల్లిని చూస్తే పిచ్చిపట్టినట్టు అరిచేవాడు. ఎలుక కనిపిస్తే పారిపోయి దాక్కునే వాడు.

బొద్దింక కనిపిస్తే భోరుమని ఏడ్చేవాడు! పాపాయమ్మ కొసరి కొసరి తినిపించినా వాడు గాలికి ఎగిరిపోయే పూచిక పుల్లలా ఉండేవాడు. వీరయ్యకు పాతికేళు్ళ వచ్చేసరికి, పాపాయమ్మకు పెద్ద జబ్బు చేసింది. ఆమె ఇక అట్టే రోజులు బతకనని గ్రహించి, వీరయ్యను పిలిచి మంచం మీద కూర్చోబెట్టుకుని, ``నీకు వీరయ్య అని పేరుపెట్టి తీరని అన్యాయం చేశాను. నీ వాలకం చూసి ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిరికివీరుడని చెప్పి నవు్వకుంటున్నారు.

నువు్వ జీవితంలో కనీసం ఒక్క సాహసకార్యం అయినా చేసి పదిమంది మెప్పును పొందాలి. ధైర్యశాలి అనిపించుకోవాలి. అదే నా కోరిక,'' అన్నది కన్నీళ్ళతో. ఆ రోజు రాత్రే ఆమె కన్నుమూసింది. తనను పిరికివాడని హేళన చేస్తూన్న ఆ ఊళ్ళో తను ఎంత సాహసకార్యం చేసినా ఎవరూ మెచ్చుకోరని వీరయ్య భావించాడు.

ఏదైనా సాహస కార్యం చేసి అవ్వ చివరి కోరిక తీర్చాలన్న పట్టుదలతో, ఒక రోజు వేకువ జామునే లేచి వాడు ఆ ఊరు వదిలి బయలుదేరాడు. వాడు సాయంకాలం దాకా నడిచి ఒక కొండ చరియ గ్రామం చేరుకున్నాడు. ఆ ఊరి రచ్చబండ వద్ద కొందరు, గొర్రెల కాపరులకు ప్రాణసంకటంగా మారిన పులిని గురించి మాట్లాడుకుంటున్నారు. వీరయ్య వాళ్ళకు తనను తాను పరిచయం చేసుకుని, ``ఇక మీకు విచారం వద్దు. ఏదైనా సాహసకార్యం చేయాలనే బయలుదేరాను.

ఆ పులిని నేను చంపుతాను,'' అన్నాడు చాలా ఉత్సాహంగా. ``చూడడానికే మహావీరుడిలా ఉన్నావు. నీ పేరు చెబితేనే పులి ఠారెత్తుకుని పారిపోగలదు,'' అంటూ నవ్వేశారు అక్కడి వాళు్ళ వాడి రూపం చూసి. అయితే, ఇద్దరు ముసలివాళు్ళ వీరయ్యను చెరువు గట్టు మీద ఉన్న మర్రిచెట్టు వద్దకు తీసుకువెళ్ళారు.

ఒక బాణం, బల్లెం వీరయ్య చేతికిచ్చి, ``ఈ చెట్టుపై కూర్చున్నావంటే, రాత్రి పూట పులి నీళు్ళ తాగడానికి చెరువుకువస్తుంది. పైనుంచి బాణం వేసి చంపవచ్చు,'' అని చెప్పి వెళ్ళిపోయారు. వీరయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. చూస్తూండగానే చుట్టూ చీకట్లు కము్మకున్నాయి. భయంతో వాడికి చెమటలు పోశాయి. అంతలో చెట్టు కింద చేరిన నక్క ఒకటి గట్టిగా ఊళ పెట్టింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన వీరయ్య చేతిలోని బాణం వదిలేశాడు.

తెల్లవార్లూ భయంతో వణుకుతూ కూర్చున్నాడు. వెలుగు రాగానే నక్క వెళ్ళిపోయింది. ``ఇంకానయం. పులి గాండ్రించి ఉంటే, ప్రాణమే పోయి ఉండేది!'' అనుకుంటూ వీరయ్య గబగబా చెట్టు దిగి, ఊరి వాళ్ళెవరూ రాకముందే, చేతిలో బల్లెంతో కనబడిన దారిగుండా ముందుకు నడిచాడు. సాయంత్రానికి వాడు మరొక ఊరు చేరి, ``ఈ ఊళ్ళో నేను చేయగల సాహసకార్యం ఏమైనా ఉందా?'' అని ఊరివాళ్ళను అడిగాడు.

``గజదొంగ గంగులు తరచూ మా ఊరి మీద పడి దోచుకుంటున్నాడు. వాడి పీడ విరగడ చేశావంటే మా ఊరికి ఉపకారం చేసిన వాడవవుతావు,'' అన్నారు ఆ ఊరి ప్రజలు. ``అదెంతపని,'' అంటూ వీరయ్య ఊరివాళు్ళ చూపిన దారిగుండా గజదొంగ గంగులు స్థావరమైన తూరుపు కొండలవైపు బయలుదేరాడు. కొండ ప్రాంతం సమీపిస్తూండగా వీరయ్యకు గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది. తల పైకెత్తి చూసిన అతడికి దౌడు తీస్తూ వస్తూన్న గుర్రాలూ, వాటి మీద నల్లటి దుస్తుల్లో ఉన్న దొంగలూ కనిపించారు.

పక్కకు పారిపోదామనుకున్నాడు కానీ, భయంతో కాళు్ళ రాక, అలాగే శిలలా బాట మధ్యలో నిలబడిపోయాడు. ``ఎవడివిరా నువు్వ? మా దారికే అడ్డు రావడానికి ఎన్ని గుండెలు?'' అంటూ దొంగలు వాణ్ణి చుట్టు ముట్టి, వాడి చేతిలోని బల్లెం లాక్కుని దూరంగా విసిరి కొట్టారు.

గజదొంగ గంగులు సర్రున కత్తి దూసి, కత్తి మొనను వీరయ్య మెడకు ఆనించి, ``మా స్థావర రహస్యాలు తెలుసుకోవడానికి వస్తున్నావా ఏం? ఎవరు నువు్వ? చెప్పు,'' అంటూ కళ్ళెర్ర చేశాడు. గుబురు మీసాలతో, క్రూరమైన చూపులతో, కారునలుపు నిలువెత్తు గంగులు రూపం చూడగానే వీరయ్యకు నోరు పిడచకట్టుకు పోయింది. ఎంత ప్రయత్నించినా నోరు మెదపలేక, ``బె... బె... బె...'' అంటూ నీళు్ళ నమలసాగాడు.

వీరయ్యను మూగవాడిగా భావించి, గంగులు కత్తిని చప్పున వెనక్కు తీసుకున్నాడు. వాడికి పెళ్ళయిన పన్నెండేళ్ళకు కొడుకు పుట్టాడు. అయితే, వాడు పుట్టు మూగ. అందుకే గంగులు మూగవాళ్ళకు ఎలాంటి అపకారమూ చేయడు. ``ఈ కొండలలోని మాస్థావరం వైపు వెళ్ళి నీ మూగ ప్రాణాన్ని బలిచేసుకోకు. నీ దారిన నువు్వ వెళు్ళ,'' అని చేత్తో సైగ చేసి తన అనుచరులతో వెళ్ళిపోయాడు గంగులు.

బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరిన వీరయ్య మరునాటి మధ్యాహ్నానికి వేరొక ఊరును సమీపించాడు. ఊరిమొదట్లోనే పదిమంది స్త్రీపురుషులు బిగ్గరగా ఏడుస్తున్నారు. వాళ్ళను చూసి, ``ఎందుకలా ఏడుస్తున్నారు? నేను ఏదైనా సాహసకార్యం చేయాలని బయలుదేరాను.

మీ కష్టం నాకు చెప్పండి. తొలగిస్తాను,'' అన్నాడు వీరయ్య. వాళు్ళ గట్టిగా చప్పట్లు చరిచి, ముందు వెళుతూన్న ఒంటెద్దు బండిని వెనక్కు రప్పించారు. ఆ బండి నిండా వంటకాలున్నాయి. ``ఇప్పటికే ఆలస్యమయింది. ఎందుకు నన్ను వెనక్కు పిలిచారు?'' అని అడిగాడు బండి తోలుతూన్న లావుపాటి మనిషి. ``నువు్వ బండి దిగు. ఈ యువకుడు ఏదైనా సాహసకార్యం చేయాలని బయలుదేరాడట.

ఒంటికొము్మ రాక్షసుణ్ణి హతమార్చడానికి మించిన సాహసకార్యం ఏముంటుంది?'' అన్నారు ఊరివాళు్ళ. దగ్గరిలోని కొండ గుహల్లో ఉంటూ ఊరి మీద పడి జనాన్ని ఇష్టంవచ్చినట్టు తినకుండా, బకాసురుడికి పంపినట్టు రోజూ బండెడు కూడు, ఒక ఎద్దు, ఒక మనిషిని పంపిస్తామని ఆ ఊరివాళు్ళ ఒంటికొము్మ రాక్షసుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ``నీ మేలు మరవలేం. వెళ్ళి ఆ రాక్షసుణ్ణి హతమార్చి రా,'' అంటూ వీరయ్యను బండి ఎక్కించారు ఊరివాళు్ళ.

బండి కొండదారి వెంట బయలుదేరింది. మరి కొంత సేపటికి బండి కొండ గుహలను సమీపించింది. ఆహారం రావడం ఆలస్యమయిందన్న ఆగ్రహంతో పెడబొబ్బలు పెడుతూ, బండరాళు్ళ దొర్లిస్తూ నానా బీభత్సం చేస్తూన్న ఒంటికొము్మ రాక్షసుడి భీకరాకారం చూసి, వీరయ్య భయంతో వణుకుతూ బండిపై నుంచి కింద పడ్డాడు. గాలికి రెప రెపలాడే పూచిక పుల్లలాంటి వీరయ్య రూపం, వాడి వణుకుతున్న దేహాన్ని చూసిన రాక్షసుడికి అంత ఆకలిలోనూ నవు్వ ఆగ లేదు.

దిక్కులు పిక్కటిల్లేలా నవ్వాడు. దాంతో వీరయ్య స్పృహ తప్పి పడిపోయాడు. కొంత సేపటికి ఎవరో ముఖం మీద నీళు్ళ చిలకరించినట్టవడంతో వీరయ్య కళు్ళ తెరిచాడు. ఎదురుగా నిలబడ్డ ఒక మధ్య వయస్కుడు, ``భయపడకు నాయనా,'' అన్నాడు. ``రాక్షసుడెక్కడ?'' అని అడిగాడు వీరయ్య భయం భయంగా. ``ఇక రాక్షసుడు రాడు నాయనా,'' అంటూ అతడు తన గురించి ఇలా చెప్పాడు: అతడొక వడ్డీవ్యాపారి. పేరు నీలకంఠం. శాపవశాన రాక్షసరూపం పొందినవాడు.

సాధు సన్యాసులంటే అతనికి చులకన భావం. ఒకసారి తీర్థయాత్రలకని వెళుతూన్న నలుగురు సాధువులను ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. సాధువులు భోజనానికి కూర్చోగానే, ఆకుల్లో బియ్యం, పచ్చి కూరగాయలు వడ్డించి, ``సాధుపుంగవులకు బియ్యం, అన్నం తేడా ఏమిటి? తృప్తిగా ఆరగించండి,'' అంటూ హేళనగా నవ్వాడు.

ఒక సాధువు, ``దురహంకారంతో నవు్వతూన్న నువు్వ, నవ్వడమే తెలియని రాక్షస రూపంలో ఆకలితో అలమటింతువుగాక!'' అని శపించాడు. తప్పు క్షమించమని నీలకంఠం సాధువు పాదాలపై బడి వేడుకున్నాడు. ``అప్రయత్నంగా నువు్వ నవ్వినప్పుడే నీకు శాపవిమోచనం,'' అని చెప్పి సాధువులు వెళ్ళి పోయారు.

మరుక్షణమే ఒంటికొము్మ రాక్షసుడిగా మారి ఇన్నాళు్ళ ఆకలితో అలమటించిన నీలకంఠానికి, వీరయ్యను చూసి అప్రయత్నంగా నవ్వడంతో రాక్షస రూపం పోయి అసలు రూపం వచ్చింది! ఆ తరవాత వీరయ్య, నీలకంఠం ఇద్దరూ బండి మీద గ్రామానికి బయలుదేరారు. బండెడు ఆహారంతో వెళ్ళినవాడు వెళ్ళినట్టు, మరొక మనిషిని వెంటబెట్టుకుని వస్తూన్న వీరయ్యను దూరం నుంచి చూసి గ్రామస్థులు విస్తుపోయారు.

వీరయ్యను చూడగానే ఒంటికొము్మ రాక్షసుడు భయపడి దూర ప్రాంతానికి పారిపోయాడని నీలకంఠం వాళ్ళకు చెప్పాడు. ఆ మాట వినగానే, `సాహస వీరుడికీ జై' అంటూ గ్రామస్థులు హర్షధ్వానాలు చేశారు. రాక్షస బాధ పోగొట్టిన వీరయ్యకు కానుకలిచ్చి సాగనంపారు. సాహస కృత్యం చేయాలని బయలుదేరిన వీరయ్య ఒక రాత్రంతా చెట్టు మీద గడపడం; గజదొంగ గంగులుకు ఎదురు వెళ్ళడం; ఒంటికొము్మ రాక్షసుణ్ణి సమీపం నుంచి చూడడం ఒకటి వెంట ఒకటి జరగడంతో వాడిలోని పిరికితనం మటు మాయమయింది.

గ్రామస్థులతన్ని సాహసవీరుడని పొగడడంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగి, నిజంగానే ధైర్యవంతుడయ్యాడు. ప్రజల చేత సాహసవీరుడనిపించుకుని అవ్వ చివరి కోరికను తీర్చినందుకు వీరయ్య ఎంతగానో సంతోషించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం