తాజా కథలు @ CCK

తథాస్తు దేవతలు

2015-05-21 05:05:01 చిన్నారుల కథలు
తన పొరుగునే ఉంటూన్న రామేశాన్ని ఏదోవిధంగా మించాలనుకుంటాడు కామేశం. తెలివితేటల్లోనూ, ఆస్తిపాస్తుల్లోనూ, మంచి తనంలోనూ పరోపకారం చేయడంలోనూ ఎదుటి వాళ్ళకన్నా, ముఖ్యంగా పొరుగింటి రామేశంకన్నా తాను ఎక్కువని చూపుకోవడానికి కామేశం రకరకాలుగా ప్రయత్నిస్తూంటాడు.

అయితే, ప్రతిసారీ అతనికి రామేశం చేతిలో భంగపాటే ఎదురవుతూ ఉండేది. రామేశానికి ఇక వెనక్కు రాదనుకున్న రెండువేల వరహాల బాకీ వసూలయింది. అది తెలిసిన కామేశం తెగ అసూయపడ్డాడు. ఆ సమయంలో కామేశం ఇంటికి భార్య తరఫు దూరపు బంధువైన పొరుగూరి రైతు చంద్రయ్య వచ్చి, ``పట్నంలో మా అన్న కూతురికి పెళ్ళి కుదిరింది. ఖర్చులకు వెయ్యి రూపాయలు తక్కువై నాకు కబురు పెట్టాడు.

సమయానికి నా దగ్గరా డబ్బులేదు. అప్పుచెయ్యకుండా అన్నను ఆదుకోవాలి కదా. నా దగ్గరున్న రెండువేల కొబ్బరి కాయల్ని-కాయ అర్ధ రూపాయి ప్రకారం అమ్మేస్తాను. నువు్వ కొనుక్కుంటే మంచి లాభంతోపాటు, ఒక ఆడపిల్ల పెళ్ళికి ఆదుకున్న సంతృప్తి కూడా ఉంటుంది,'' అన్నాడు లౌక్యంగా. సంతలో కొబ్బరి కాయలకు గిరాకీ లేక, చంద్రయ్య వాటిని తనకు అంటగట్టాలని, చూస్తున్నాడని వ్యాపారంలో ఘటికుడైన కామేశం గ్రహించాడు.

అయితే, రామేశాన్ని దెబ్బతీయడానికి ఇదొక మంచి అవకాశమని భావించి, ``సమయానికి నా దగ్గరా డబ్బులేదు. పరోపకారానికి మారుపేరైన మా పక్కింటి రామేశం నీకు సాయపడవచ్చు. రా, వెళదాం,'' అంటూ చంద్రయ్యను రామేశం ఇంటికి తీసుకువెళ్ళాడు. అప్పుడక్కడ ఊరి పెద్దలు కొందరుంటే, రామేశం వారికి పరోపకారం గురించి చెబుతున్నాడు. కామేశం చంద్రయ్యను రామేశానికి పరిచయం చేసి, ``నా దగ్గర డబ్బులేదు.

నీ దగ్గర డబ్బుందని తెలిసి ఇతన్నిలా తీసుకువచ్చాను. సరుకు కొని మన ఊరి పరువు నిలబెట్టు,'' అన్నాడు. అక్కడున్న పెద్దమనుషులకు కామేశం దురుద్దేశం అర్థమైంది. వాళ్ళల్లో ఒకాయన, ``ఇప్పుడు కొబ్బరి కాయలకు గిరాకీ లేదు. అలాంటప్పుడు రామేశం రెండువేల కాయలు కొని ఏం చేసుకుంటాడు?'' అన్నాడు. అందుకు కామేశం నవ్వి, ``అలా ఆలోచించేది నువూ్వ, నేనూను. మన రామేశం పద్ధతే వేరు.

తను ఈ సరుకు కొంటాడు. ఉద్దేశం మంచిది కాబట్టి, ఊహించనంత లాభం గడిస్తాడు,'' అన్నాడు రామేశాన్ని ఇరుకున పెట్టాలని. రామేశం వెంటనే, ``పైన తథాస్తు దేవతలున్నారు. మంచి ఉద్దేశంతో మన కామేశం చెప్పిన మాటకు వారు తథాస్తు అన్నారు,'' అని చంద్రయ్యకు వెయ్యి వరహాలిచ్చి సరుకు కొనేశాడు. ఇలా ఉండగా ఆ దేశపురాజు ప్రజాక్షేమానికి ఒక యాగం తలపెట్టాడు. అందుకు లక్ష కొబ్బరికాయలు కావాలి.

స్వదేశంలో గిరాకీ లేక చాలామంది తమ సరుకును అయినకాడికి పొరుగు దేశాలకు అము్మకోవడంతో-రాజు కొబ్బరి కాయలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. అవసరాన్ని గమనించి విదేశ వ్యాపారులు కాయ ధరను నాలుగు రూపాయలకు పెంచేశారు. రాజు మంత్రులను పిలిచి, ``మన అవసరానికి పొరుగుదేశం వ్యాపారులు ఎందుకు లాభపడాలి? కాయకు రెండు రూపాయలిస్తామని దేశమంతా చాటింపు వేయించండి.

మన దేశం వాళు్ళ తమ దగ్గరున్న సరుకు తెచ్చిచ్చాక, తక్కువయినవి మాత్రం విదేశాల నుంచి కొందాం. అలా అధికలాభం మన ప్రజలకే దక్కుతుంది,'' అన్నాడు. మర్నాడు రాజుగారి చాటింపు విన్న ఊరి పెద్దమనుషులు రామేశం ఇంటికి వచ్చి ఆయన్ను అభినందించారు. ఆయన వెంటనే, ``ఇదంతా కామేశం నోటి చలవ.

తనొక మంచి మాట అంటే తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు,'' అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కామేశం, ``పైకి తథాస్తు దేవతలు అంటాడు గానీ, రాజు చాటింపు గురించి రామేశానికి ముందే తెలుసు. బేరంలో పోటీకి వస్తామని మనకు చెప్పలేదు. లాభమంతా తనకే చెందాలని చంద్రయ్యకూ ఆ విషయం చెప్పలేదు,'' అన్నాడు ఉక్రోషంతో. ఆ మాటకు అక్కడ చేరిన పెద్దమనుషులు నిర్విణ్ణులయ్యారు.

``నీ కపట బుద్ధి బయట పడకుండా, పది మందిలో మంచివాడనిపించుకోవడానికి ఏవో చెబుతున్నావుగానీ అసలు విషయం నీకు ముందే తెలుసు,'' అన్నాడు కామేశం ఎంతో ఆవేశంగా రామేశంతో. ``అనవసరంగా ఆవేశపడకు కామేశం. అన్న కూతురి పెళ్ళికి సాయపడాలన్న అవసరంలో ఉన్న చంద్రయ్యను నా దగ్గరికి వెంట బెట్టుకు వచ్చింది నువు్వ. కొబ్బరి కాయలను కొనమని చెప్పింది నువు్వ. నేను అతన్ని వెతుక్కుని వెళ్ళి, రహస్యం దాచి సరుకు కొనలేదు కదా? అలాంటప్పుడు నాకెలా దురుద్దేశం అంటగడతావు?'' అన్నాడు రామేశం నెమ్మదిగా.

ఆ మాటకు కామేశం మరింత ఉక్రోషపడి ఏదో అనబోతూంటే చంద్రయ్య అక్కడికి వచ్చాడు. సరుకు అమ్మడంలో తనకు రాబోయే లాభాన్ని సమంగా పంచుకోవడానికి రమ్మని రామేశం కబురు పెట్టడం వల్లే, అతడక్కడికి వచ్చాడని తెలియడంతో కామేశానికి నోట మాట రాలేదు. ఆ విధంగా కామేశం రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం