తాజా కథలు @ CCK

వాగ్దానం నిలుపుకునే వారే ఉత్తములు

2015-06-07 13:05:01 చిన్నారుల కథలు
బీర్బల్‌ తెలివి తేటలు, చతురత పట్ల అత్యంత సంతుష్టులైన అక్బర్‌, ఒకరోజు అనుకోకుండా 50 గ్రామాలు గల ఒక తాలూకాను బీర్బల్‌కు బహుమానంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. కాని ఎన్ని రోజులు గడిచినా తన వాగ్దానాన్ని మాత్రం నిలబెట్టుకోలేదు. ఒకరోజు అక్బర్‌తో మాట్లాడుతుండగా, బీర్బల్‌ తన 'తాలూకా బహుమతి' విషయం ఆయనకు పరోక్షంగా గుర్తు చేయడానికి ప్రయత్నించాడు. కాని , బీర్బల్‌ ఉద్దేశాన్ని గ్రహించి, అతని మాటను విననట్టు మొహం పక్కకు తిప్పుకున్నాడు అక్బర్‌. తనకు తాలూకాను బహుమతిగా ఇవ్వడం అక్బర్‌కు ఇష్టం లేదని బీర్బల్‌కు అర్ధమయ్యింది. బీర్బల్‌ మనస్తాపం చెందాడు. అవమానంగా భావించాడు.

కాని , ఆ సమయంలో ఏమీ అనలేకపోయాడు. మరుసటి రోజు, బీర్బల్‌ అక్బర్‌తో ఉదయం పూట విహారానికి చక్రవర్తిగారి తోటలోకి బయలుదేరాడు. అక్కడ ఒంటెను చూసిన అక్బర్‌కు వింత సందేహం కలిగింది. వెంటనే బీర్బల్‌తో "బీర్బల్‌! అన్ని జంతువుల మాదిరిగా ఒంటె మెడ సరిగా ఎందుకుండదు ? అది అసాధారణంగా వంగి వుంటుంది.

ఈ లోపం వెనుక ఏదో కధ దాగే ఉంటుంది కదా !" అన్నాడు.

నిన్నటి సంఘటన మరిచిపోని బీర్బల్‌, అక్బర్‌ సందేహాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని "మహరాజా! ఒంటె మెడ ఇలా వంగి ఉండటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఒంటె తన తాలూకాను బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేసింది. కొంతకాలం గడిచేసరికి అది ఆ సంగతి మరిచిపోయింది. వాగ్దానం గ్రహించిన వ్యక్తి ఒంటెను అడగగానే అది తన మొహాన్ని పక్కకు తిప్పుకుంది. అందుకే మరుజన్మలో మెడకు ఇలా లోపం సంభవించింది" అన్నాడు.

బీర్బల్‌ చురకతో అక్బర్‌కు అసలు విషయం అర్ధమైంది. మరుసటి రోజే బీర్బల్‌ను పిలిచి ఒక తాలూకాను బహుకరించాడు.

నీతి :

వాగ్దానం నిలుపుకునే వారే ఉత్తములు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం