తాజా కథలు @ CCK

ప్రయోజకుడు

2014-10-19 15:05:01 చిన్నారుల కథలు
చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శివుణ్ణి, అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది.బడిలో పిల్లలను కొట్టాడని పంతులు వాణ్ణి బడికి రానివ్వలేదు.దాంతో శివుడి చదువు సాగకపోగా వాడిలో మొరటుతనం పెరగసాగింది.

శివుడి అవ్వ రోజూ ఉదయం,సాయంకాలం మంగాపురం రామాలయం ఆవరణను శుభ్రం చేసేది.చింకి గోతాంను భుజాన వేసుకుని వీధుల్లో పడివున్న చెత్తను ఏరి,ఊరికి దూరంగా పోసేది.గ్రామస్థులు అవ్వ ఉండడానికి ఊరిచివర గుడిసె వేసి ఇచ్చారు.అవ్వ అందులో మనవడితో ఉంటూ,తీరిక సమయంలో చిరిగిన బట్టలనూ,తలకడలనూ కుట్టుకుంటూ జీవనం సాగించేది.శివుణ్ణి కష్టపడనిచ్చేది కాదు.దాంతో వాడు సోమరిపోతుగా తయారయ్యాడు.అందరూ వాణ్ణి,'పనికిరానివాడివి!' అని తిట్టేవారు.శివుడు అలాంటివారి మీద కోపంతో తిరగబడేవాడు.అలాంటి సమయాల్లో అవ్వ వాణ్ణి బుజ్జగించేది.

అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది.తనకు ఆఖరు ఘడియలు సమీపిస్తున్నాయని అవ్వ మనవణ్ణి దగ్గరికి పిలిచి,"నాయనా,శివయ్యా,అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధ పడి, వాళ్ళ మీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏదీ ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది.ఇవాళపనికిమాలినవాడివనిపించుకుంటూన్న నువ్వే,రేపు పదిమంది చేత ప్రయోజకుడివి అనిపించుకోవచ్చు.ఆ శ్రీరాముడే నీకు రక్ష," అంటూ కన్నుమూసింది.

అవ్వ పోయాక ఊరిజనం శివుణ్ణి మరింత చులకనగా చూడసాగారు.శివుడికి ఆ ఊళ్ళో మరిక ఉండాలనిపించలేదు.వేరెక్కడికైనా వెళ్ళి,తన సత్తా నిరూపించుకుని అవ్వ చెప్పినట్టు ప్రయోజకుడిగా ఆ ఊరికే తిరిగి రావా లని నిర్ణయించాడు.గుడిసెలో ఒక మూలగా అవ్వ ఉపయోగించిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూదీ కనిపించాయి.వాటిని చూడగానే శివుడికి,"ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు," అన్న అవ్వ మాటలు గుర్తుకు వచ్చాయి.గోతాన్ని తీసి భుజాన వేసుకుని,సూదిని తీసి దుస్తుల్లో భద్రం చేసుకుని శివుడు అక్కడి నుంచి బయలుదేరాడు.

వాడు కొంతదూరం ప్రయాణం చేశాక,ఒక చిట్టడవి ఎదురయ్యింది.కొంత సేపటికి శివుడితో ఒక పెళ్ళి బృందం వచ్చి కలిసింది.మరి కొంత దూరం వెళ్ళాక ఎదురుపడ్డ ఒక బాటసారి,"శుభకార్యానికి బయలుదేరినట్టున్నారు.నగానట్రా బాగా ఉంది.త్వరగా అడవిదాటండి.ఈ ప్రాంతంలో బందిపోట్ల బెడద ఎక్కువ," అని పెళ్ళివారితో చెప్పివెళ్ళాడు.

ఆ మాట వినగానే పెళ్ళివారికి గుండెదడ ఆరంభమయింది.వేగంగా నడవసాగారు.కొంతసేపటికి వాళ్ళకు గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది.వచ్చే వాళ్ళు దొంగలముఠా అని గ్రహించి హడలిపోయారు. అంతలో చింకి గోతాం భుజాన వేసుకుని నడుస్తూన్న శివుణ్ణి చూడగానే వాళ్ళలోని ఒక పెద్దాయన,"ఆడవాళ్ళందరూ ఒంటి మీద కొద్ది పాటి నగలే ఉంచుకుని,మిగతా వాటిని ఈ చింకి గోతాంలో పడేయండి," అన్నాడు.క్షణాలలో వాళ్ళా పని చేశారు.తరవాత ఆ పెద్దాయన సంచీని శివుడి చేతికిచ్చి,"దీన్ని నీ భుజాన వేసుకుని ముందు నడిచిపో," అన్నాడు.శివుడు అలాగే నడవసాగాడు.అంతలో గుర్రాల మీద వచ్చిన దొంగలు, పెళ్ళివారి ఒంటి మీదున్న నగలను దోచుకున్నారు.దొంగల నాయకుడి దృష్టి, శివుడి చింకి గోతాం మీద పడడంతో,"ఏముంది ఆ గోతాంలో?" అని గద్దించి అడిగాడు.

"చూస్తే తెలియడంలేదూ.మోయలేనన్ని కాసుల పేర్లూ, అరవంకీలు,ఒడ్డాణాలు. ఉంటే ఏం చేస్తావు? దోచుకుంటావా?" అని ఆవేశంగా గెంతుతూ మొరటుగా సమాధానమిచ్చాడు శివుడు. ఆ మాటవిన్న దొంగల ముఠానాయకుడు,"వీడెవడో మతిచెడిన వెధవలా ఉన్నాడు.వీడి జోలికి వెళ్ళకండి," అంటూ గుర్రాన్ని అదిలించాడు.మిగిలిన దొంగలు వాణ్ణి అనుసరించివెళ్ళారు.

ఆ తరవాత శివుడి గోతాంలోని నగలను వెనక్కు తీసుకున్న పెళ్ళిబృందం వాళ్ళు,"భలే ధైర్యవంతుడివి.సమయానికి ఆదుకున్నావు," అంటూ శివుణ్ణి మెచ్చుకుని పది బంగారు కాసులు కానుకగా ఇచ్చారు.బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో శివుడు వేగంగా నడవసాగాడు.అడవిదాటి కొంత దూరం పోయేసరికి, వాడికి ఒక మామిడితోపు కనిపించింది.అక్కడున్న కొందరు ఆందోళనతో గుసగుసలాడుకోవడం గమనించిన శివుడు కారణం అడిగాడు.

"మహారాజును దర్శించుకుని తిరిగి వస్తూన్న మా మణికంఠపురం జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు.కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులు విడిచినప్పుడు ముల్లు గుచ్చుకుంది.ఎలా తీయాలో పాలుపోవడం లేదు," అన్నారు వాళ్ళు దిగులుగా.

"ఓస్, ఇంతేనా? మా అవ్వ నా కాలికి గుచ్చుకున్న ముళ్ళు ఎన్ని తీయలేదు? తప్పుకోండి," అంటూ దుస్తుల్లో దాచిన సూదిని తీసుకుని ముందుకు వెళ్ళిన శివుడు,జమీందారు కాలినుంచి ముల్లును సూదితో చటుక్కున తీసేశాడు.వాడి దుందుడుకుతనానికి మొదట చీదరించుకున్నప్పటికీ, క్షణంలో ముల్లు తీసేయడం వల్ల జమీందారు వాణ్ణి మెచ్చుకున్నాడు.

ఆలోగా అక్కడికి చేరుకున్న పెళ్ళిబృందం వాళ్ళు, అడవి మార్గంలో శివుడు తమకు చేసిన సహాయం గురించి జమీందారుకు చెప్పారు.

ఆ మాట విని మరింతగా సంతోషించిన జమీందారు శివుడి వివరాలు అడిగి తెలుసుకుని,"అంటే,నీది మంగాపురమా? అది మా జమీలోని గ్రామమే.కొంతకాలంగా శిస్తులు సరిగ్గా వసూలు కావడం లేదు.శిస్తులు వసూలు చేసే అధికారికి నీలాంటివాడి సాయం కావాలి.నిన్ను అతడికి సహాయకుడిగా నియమిస్తున్నాను.ఆ ఉద్యోగంలో చేరుతావా?" అని అడిగాడు.

శివుడు సంతోషంతో సరేనన్నాడు.కొన్నేళ్ళ తరవాత శిస్తులు వసూలు చేసే అధికారిగా మంగాపురం వెళ్ళినప్పుడు గ్రామాధికారితో సహా గ్రామస్థులందరూ గౌరవంతో తనను "శివయ్యగారూ," అని పిలవడం చూసి శివుడు ఆశ్చర్యపోయాడు."ఈరోజు పనికిమాలినవాడివని నిన్ను హేళన చేసినవారే రేపు ప్రయోజకుడివని మెచ్చుకోగలరు," అన్న అవ్వ దీవెనలు నిజమైనందుకు శివుడు లోలోపల ఎంతగానో సంతోషించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం