తాజా కథలు @ CCK

రామలింగడి తెలివి

2015-04-21 13:05:01 చిన్నారుల కథలు
శ్రీ కృష్ణదేవరాయలు ఒకసారి చాలా సంతోషంగా ఉన్నాడు . ఆ సందర్భంగా తన ఆస్థాన కవులకి యాభై చొప్పున బంగారు నాణేలు ఇచ్చి వాటిని వారం రోజుల్లో ఖర్చు చేయమని చెప్పాడు . అయితే దానికి ఒక షరతు పెట్టాడు . అదేంటంటే , ప్రతి నాణేన్ని ఖర్చు చేసే ముందు తన ముఖం చూడమన్నాడు . అలా చూసి ఖర్చుచేయలేక పోతే ఆ నాణేన్ని తిరిగి ఇవ్వాలని చెప్పాడు . దానికి తెనాలి రామలింగడితోపాటు కవులంతా సరేనని తలూపారు .
కవులు కావాల్సినవి కొనాలని దుకాణాల దగ్గరకు వెళ్లారు . వారికి చాలా నచ్చాయి . కొనాలనుకున్నారు . కానీ 'నా ముఖం చూశాకే ప్రతి నాణేన్ని ఖర్చుచేయాలి' అన్న రాజు మాటలు గుర్తొచ్చి అటుగా రాజు వస్తాడేమోనని ఎదురు చూశారు . కానీ రాజు ఆ వారం మొత్తం అటుగా కనిపించలేదు .
వారం తర్వాత కవుల సమావేశం నిర్వహించాడు . కవులను ' నాణేలు ఖర్చుచేశారా ' అని అడిగాడు . బదులుగా ........ 'మీ ముఖం చూసి కొనమన్నారు . మీరు దుకాణాలవైపు వస్తారేమోనని ఈ వారం రోజులూ చూశాం . ఒక్కసారి కూడా రాలేదు . ఒక్క నాణెం కూడా ఖర్చుచేయలేదు ' అన్నారు కవులు .
' రామలింగా నీ సంగతో ' అడిగాడు రాయలు .
' రాజా , నేను మొత్తం ఖర్చుచేసేశాను ' అన్నాడు .
' అదెలా , నా ముఖం చూడకుండానే ' అడిగాడు రాయలు .
'రాజా ప్రతి నాణెం మీద మీ బొమ్మ ఉంది . దాన్ని చూసి ఖర్చుచేశాను ' అన్నాడు .
రామలింగడి తెలివికి రాయలతోపాటు సభలోని వారంతా ఎంతో మెచ్చుకున్నారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం