తాజా కథలు @ CCK

సమయస్ఫూర్తి

2015-05-10 01:05:01 చిన్నారుల కథలు
విదర్భపురాన్ని జయేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు ఆ రాజు నిద్రిస్తున్న సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో అతని నోటి పళ్ళన్నీ ఊడిపోయి, ఒక పన్ను మాత్రమే మిగిలింది. మెలకువ వచ్చిన జయేంద్రుడు ఆ కలకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. మరునాడు కలలకు అర్థం చెప్పగలిగే జ్యోతిష్యులను పిలిపించమని సభలో మంత్రు లను ఆదేశించాడు.

రెండు రోజుల తరువాత ఇద్దరు ప్రముఖ జ్యోతిష్యులు రాజసభకు వచ్చారు. జయేంద్రుడు తన కల చెప్పి దానికి అర్థం ఏమిటో వివరించమని అడిగాడు. జ్యోతిష్యులు తమ దగ్గరున్న తాళపత్ర గ్రంథాలు చదివి, వేళ్ళ మీద చాలాసేపు లెక్కించారు.

తరువాత ఒక జ్యోతిష్యుడు ‘‘రాజా! మీ సన్నిహితులు, బంధువులు అందరూ మీకంటే చాలా ముందుగా చనిపోతారు’’ అన్నాడు. అతను చెప్పింది అక్షరాలా నిజం. శాస్త్రం అదే చెబుతోంది.
కానీ అది వినగానే జయేంద్రుడికి కోపం వచ్చింది. ఆ మాటలు ఎంతో కఠినంగా తోచాయి. భటులను పిలిచి, జ్యోతిష్యుడిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఇంతలో రెండో జ్యోతిష్యుడు కల్పించుకుని, ‘‘ప్రభూ! అందరికంటే మీరు ఎక్కువ సంవత్సరాలు జీవించి రాజ్యాన్ని పరిపాలిస్తారని మీ కల చెబుతోంది. మీ సన్నిహితులు, బంధువులకంటే మీ ఆయుష్షు ఎక్కువని దీని అర్థం. అతను కూడా అదే చెప్పాడు ప్రభూ’’ అన్నాడు.

రెండో జ్యోతిష్యుడి మాటలు విని జయేంద్రుడి కోపం తగ్గింది. ‘‘మరి ఆ మాటే సరిగ్గా చెప్పవచ్చు కదా!’’ అని ఆ జ్యోతిష్యుడిని వదిలిపెట్టమని భటులకు చెప్పాడు.
రాజప్రసాదం నుండి బయటపడ్డాక తన ప్రాణాలు కాపాడినందుకు మొదటి జ్యోతిష్యుడు రెండో వ్యక్తితో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

‘‘ఫరవాలేదు మిత్రమా! కానీ ఒక విషయం నువ్వు గుర్తుంచుకో. ఎదుటివారికి రుచించని విషయాలు, చెడు సంగతులు చెప్పాల్సి వచ్చినప్పుడు వాటిని సూటిగా చెప్పకూడదు. నర్మగర్భంగా, డొంకతిరుగుడుగా వాళ్ళకు అర్థమయీ కానట్టుగా చెప్పాలి’’ అని సలహా ఇచ్చాడు రెండో జ్యోతిష్యుడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం