తాజా కథలు @ CCK

పరివర్తన

2015-05-30 11:05:01 చిన్నారుల కథలు
కార్తీక్‌ నాలుగవ తరగతి చదువుతున్నాడు. చదువుల్లోనూ, ఆట , పాటల్లోనూ, అన్నింటిలోనూ ముందుంటాడని అతనంటే అందరికీ చాలా ఇష్టం. కృష్ణది కూడా అదే తరగతి. బాగా అల్లరి చేస్తాడు. తోటి వారిని ఏడిపిస్తుంటాడు. ఇంట్లో ఎవరి మాటా వినడు. దాంతో అతనంటే అందరికీ కోపంగా ఉండేది. కార్తీక్‌ని చూసి కృష్ణ ఎంతో కుళ్లుకునేవాడు.

ఆ రోజు కార్తీక్‌ బర్త్‌డే. వాళ్ల డాడీ అతనికి ఓ ఖరీదైన కలాన్ని బహుమతిగా ఇచ్చాడు. అసలే చక్కటి దస్తూరీ కార్తీక్‌ది. ఆ పెన్నుతో రాయడంతో అతని చేతి రాత మరింత అందంగా కుదిరేది. కృష్ణ కళ్లు ఆ పెన్ను మీద పడ్డాయి. ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. ఓ రోజు తరగతిలో ఎవరూ లేని సమయం చూసి కార్తీక్‌ సంచి లోని కలాన్ని తీసి తన సంచిలో పెట్టుకున్నాడు. కాసేపటి తర్వాత కార్తీక్‌ వచ్చి తన పుస్తకాల సంచి చూసుకున్నాడు. కలం లేకపోవడం చూసి ఏడవటం మొదలుపెట్టాడు. టీచర్‌ ఒక కుర్రాడిని పిలిచి అందరి బ్యాగులూ చెక్‌ చేయమని చెప్పింది. ఆ కుర్రాడు అందరి బ్యాగ్‌లూ వెదుకుతూ కృష్ణ బ్యాగ్‌లో కలాన్ని చూశాడు. టీచర్‌ కృష్ణ వంక కోపంగా చూసింది. అతన్నలా చూసే సరికి కార్తీక్‌కి జాలేసింది. "నా పెన్ను దొరికింది కదా టీచర్‌, దయచేసి కృష్ణని ఏమీ అనొద్దు" అని బతిమాలాడు. టీచర్‌ కృష్ణని వదిలేసింది.

అప్పుడర్ధమైంది కృష్ణకు అందరూ కార్తీక్‌ను ఎందుకు ఇష్టపడతారో ! దగ్గరికెళ్లి 'సారీ' చెప్పాడు. నవ్వుతూ అతని భుజం తట్టి తమ జట్టులో కలుపుకున్నాడు కార్తీక్‌. అప్పటి నుంచి అల్లరి మానేసి చదువుపై దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకోసాగాడు కృష్ణ. అతనిలో వచ్చిన పరివర్తనకు అందరూ ఎంతో సంతోషించారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం