తాజా కథలు @ CCK

గాడిద బ్రతుకు

2015-05-03 15:05:01 చిన్నారుల కథలు
అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మ, అవ్వ, బాబు ఉండేవారు. ఒక రోజు వాళ్ళు ముగ్గురూ ప్రక్క ఊరికి బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక గాడిద పిల్ల కనిపించింది.

బాబు అన్నాడు "అమ్మా! ఈ బుజ్జి గాడిద చూడు ఎంత అందంగా ఉందో! మనం దీనిని పెంచుకుందామా?" అని.

"సరే అట్లాగే కానివ్వురా, నీ ఇష్టం" అన్నది అమ్మ.

గాడిదను కూడా వాళ్ళు తమతోపాటు తీసుకువెళ్ళారు. దానికి ఏ పనులూ చెప్పకుండా ముచ్చటగా చూసుకునేవాళ్ళు వాళ్ళు. కొన్ని రోజులకు అది కొంచెం పెద్దది అయ్యింది.

అంతవరకూ వాళ్లమీదే ఆధారపడి బ్రతికిన ఆ గాడిదకు పెద్దవ్వగానే వేరే ఆలోచనలు మొదలయ్యాయి- అది తన మనస్సులో అనుకుంది-"ఏంటి ఇది? నేను ఒకలాగా ఉన్నాను, వీళ్ళు ఒకలాగా ఉన్నారు! అసలు నేను ఎవరిని, వీళ్ళు ఎవరు? వీళ్ళేమో ఇడ్లీలు- దోశెలు తింటారు; నాకేమో గడ్డీ, గాదం తినిపిస్తారు. సరిగ్గా తిండి కూడా‌ పెట్టరు; పైపెచ్చు నాతో పని చేయించుకుంటారేమో ఇంక!" అని అనుకుంది.

దాంతో దానికి బాధ మొదలైంది. 'తనని ఎవ్వరూ ప్రేమించటం లేదు; తన శ్రమను మాత్రం దోచుకుంటారు' అనుకున్నదది. "నేను ఈ రోజు రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయాననుకో, మరి వాళ్ళు నన్ను వెతుకుతారా, వెతకరా?" అని సందేహించి, అది ఒక రోజున కట్లు తెంచుకొని బయట పడింది. తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక రోజంతా ఎవ్వరికీ కనపడకుండా ఒక చోట దాక్కున్నది.

బాబు గాడిదకోసం‌ చాలా వెతికాడు; కానీ వాడికి అది కనబడితేగా? గాడిద ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు.

"చూశావా, ఎవ్వరూ నాకోసం వెతకను కూడా వెతకలేదు! అంటే వీళ్ళెవ్వరికీ నామీద ప్రేమలేదన్న మాట. కేవలం పనికి మాత్రమే వాడుకుంటారన్నమాట నన్ను!" అనుకొని గాడిద వాళ్ళనుండి దూరంగా పారిపోయింది.

ఆ తర్వాత అది చాలా మంది దగ్గరికి వెళ్ళింది. దాన్ని దగ్గరికి తీసినవాళ్ళంతా దాని చేత చాకిరీనే చేయించుకున్నారు. పాపం ఎవ్వరూ దానికి ఏనాడూ ఇడ్లీలూ, దోసెలూ పెట్టనే లేదు!

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం