తాజా కథలు @ CCK

అందర్నీ మెప్పించడం ఎంతో కష్టమైన పని

2015-05-01 15:05:01 చిన్నారుల కథలు
ఒక రోజు ఒకతను తన కొడుకును, గాడిదను తీసుకుని బజారుకి వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్దమనిషి వీరిని చూసి, '' అదేంటయ్యా ! అంత గాడిదను పెట్టుకుని నడుస్తూ పోతున్నారు ?'' అని అడిగాడు.
నిజమే కదా అనుకుని ''బాబూ ! నువ్వు ఎక్కు'' అని తండ్రి కొడుకుని గాడిదపై కూర్చోబెట్టి, తను నడుస్తూ వెళ్తున్నాడు.

ఇంకొంత దూరం పోయాక మరో పెద్దమనిషి వీళ్లని ఆపి, '' ఏం కొడుకువయ్యా నువ్వు ? పెద్దవాడైన తండ్రిని నడిపిస్తూ నువ్వు సుఖంగా గాడిదెక్కి పోతున్నావా ?'' అన్నాడు.

దాంతో కొడుకు దిగిపోయి, తండ్రిని గాడిదపై కూర్చోబెట్టాడు. అలా ఇంకొంత దూరం పోయాక ఇంకో మనిషి వీళ్లని ఆపి, ''అసలేం తండ్రివి నువ్వు ? చిన్న వాణ్ణి నడిపిస్తూ నువ్వు గాడిదెక్కి ఊరేగుతావా ?'' అన్నాడు.
అది విని, కొడుకు కూడా గాడిద పైకి ఎక్కి కూర్చున్నాడు.

అలా కాస్త దూరం వెళ్లారో లేదో   ఇంకొక అతను వీళ్లని చూసి, ''ఛ ! ఛ ! మీకసలు దయ, జాలి ఉన్నాయా ? మీరే గాడిదల్లా పెరిగి, పాపం నోరులేని జీవంపై కూర్చుంటారా ?'' అన్నాడు.

ఇదెక్కడి గొడవరా బాబూ అనుకుని, తండ్రీ కొడుకులిద్దరూ దిగి, గాడిదను భుజాల మీదకెత్తుకుని నడవసాగారు. అది చూసి దారిన పోయేవాళ్లందరూ గట్టిగా నవ్వడం మొదలెట్టారు. దాంతో గాడిద కంగారుపడి, పారిపోయింది.
చూశారా ! ఏమైనా అందర్నీ మెప్పించడం ఎంత కష్టమైన పనో కదా !

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం