తాజా కథలు @ CCK

డాం డాం డాం

2015-06-05 21:05:01 చిన్నారుల కథలు
ఒక ఊళ్ళో ఒక కోతంట. ఆ కోతి కొండమీదికి ఎక్కుతావుంటే తోక లోకి ఒక ముల్లు గుచ్చుకుందంట. అప్పుడా కోతి ఊళ్ళోకి వచ్చిందంట. అప్పుడొక వేటగాడు ఒక కత్తి ఎత్తుకుని పోతావుంటే ఆ కోతి వేటగాడి దగ్గరకి పోయి "నాకు ముల్లు తీయవా?" అని అడిగిందంట.

అప్పుడు వాడు ముల్లు తీసెయ్యడానికని ప్రయత్నిస్తే దాని తోక తెగిపోయిందంట. అప్పుడా కోతి, వేటగాడితో "నాకు నా తోకిస్తావా, లేక నీ కత్తిస్తావా?" అని అడిగిందంట. అప్పుడు ఆ వేటగాడు కత్తినిచ్చేశాడంట.
కోతి  కత్తెత్తుకుని పోతావుంటే ఒక అక్క చేత్తోనే కట్లించుతా కనబడిందంట. "ఎందుకక్కా కట్టెలను చేత్తో ఇంచుతావున్నావు?. కత్తుంది ఇద్దో తీసుకో. తీసుకొని దీంతో‌ కట్లు నరుక్కో" అని కత్తిచ్చిందంట.

ఆ అక్క కత్తితో కట్లు నరుకుతావుంటే కత్తి శీల పూడ్చిందంట.
అప్పుడు కోతి ఆ అక్కతో "నా కత్తిస్తావా, లేక నీ కట్లిస్తావా?" అని అడిగిందంట.

అప్పుడా అక్క కోతికి కట్లిచ్చేసిందంట.

కోతి ఆ కట్టెలను తీసుకొని పోతావుంటే, ఒక అవ్వ పొయ్యిలో కాగితాలు పెట్టి దోసలు కాలుస్తా కనబడిందంట. చూసిన కోతి  "ఎందుకవ్వా కాగితాలు పెట్టి కాలుస్తున్నావు? ఇవిగో ఈ కట్లు తీసుకుని కాల్చుకో" అని కట్లిచ్చిందంట.

ముసలమ్మ దోసెలన్నీ కాల్చేపాటికి కోతి తనకిచ్చిన కట్టెలన్నీ అయిపోయాయంట. అప్పుడు కోతి ఆ అవ్వతో "నా కట్లిస్తావా? లేక నీ దోసెలిస్తావా?" అని అడిగిందంట.

అవ్వ కోతికి దోసెలు ఇచ్చిందంట.
దోసెలు తీసుకుని పోతున్న కోతికి మడకను దున్నే ఒక అన్న ఆకలిగొని నీరసంగా కనిపించాడంట. "ఇవిగో ఇవి తినన్నా" అని ఆ కోతి అతనికి దోసెలిచ్చిందంట. అతనేమో ఆకలితో ఉండి దోసెలన్నీ తినేశాడంట.

అప్పుడు కోతి "నా దోసెలిస్తావా, లేక నీ మడకిస్తావా?" అని ఆ అన్నను అడిగిందంట.

అన్న మడకిచ్చేసినాడంట. మడకను తీసుకుని ఒకచోట పెట్టిందంట కోతి. దావంట బొయ్యే చాకలాయన దొందురుకుని పడితే మడక ఇరిగిపోయిందంట. "నా మడకనిస్తావా లేక నీ తొట్టిబాననిస్తావా?" అని అడిగిందట. "సరే నీతో నాకెందుకు?" అని చాకలాయన దానికి బాననిచ్చేశాడంట.

తొట్టిబానను కూడా తీసుకుని పోతావుంటే దానికి ఒకచోట చేతుల్తో పూల తోటకు నీళ్లు పోస్తున్న మనుషులు కనిపించారంట. అప్పుడది "ఎందుకన్నా చేతుల్తో నీళ్లు పోస్తున్నారు? ఇదిగో ఈ బానతో పోసుకోండ"ని వాళ్లకు ఆ బానను ఇచ్చిందంట.

బాన తీసుకుని పూల తోటకు నీళ్ళు పోస్తుంటే ఆ బానకు చిల్లు పూడ్చిందంట. అప్పుడు కోతి నాబానిస్తావా లేక నీ పూలిస్తావా?" అని అడిగిందంట.

"పూలే తీసుకొమ్మ"ని కాసిన్ని పూలిచ్చారంట వాళ్లు.

పూలను తీసుకుని పోతున్న కోతికి  తలలో పూలు లేకుండా పోతున్న ఒక పెళ్లి కూతురు కనిపించిందంట. అప్పుడు కోతి "ఓ పెళ్లికూతురా! ఎందుకట్లా పూలు పెట్టుకోకుండానే పోతున్నావు, ఇవిగో పూలు తీసుకో"మని ఆమెకు పూలిచ్చిందంట. పెళ్లికూతురు పూలు పెట్టుకున్నాక ఆ పూలన్నీ వాడిపోయాయంట.

అప్పుడా కోతి, అక్కడే ఉన్న డప్పునెత్తుకొని,

"కాలు పోయి కత్తొచ్చె డాం డాం డాం!
కత్తిపోయి కట్లొచ్చె డాం డాం డాం!
కట్లు పోయి దోసెలొచ్చె డాం డాం డాం!
దోసెలు పోయి మడకొచ్చె డాం డాం డాం!
మడకా పోయి తొట్టిబానొచ్చె డాం డాం డాం!
తొట్టిబాన పోయి పూలొచ్చె డాం‌ డాం డాం!
పూలు పోయి పెళ్లికూతురొచ్చె డాం డాం డాం!

అని పాడిందంట.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం