తాజా కథలు @ CCK

మహిమగల రాళ్లు

2015-03-28 15:05:01 చిన్నారుల కథలు
పాయకాపురంలో నందుడు, సోముడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. నందుడు ఆలోచనా పరుడు. సోముడికి తొందరపాటు ఎక్కువ. ఉచితంగా లభించే వాటి కోసం ఉబలాట పడేవాడు.

ఇద్దరూ ఒకనాడు బతుకు తెరువు వెతుక్కుంటూ, గ్రామం వదిలి రాజధాని కేసి బయలుదేరారు. అడవి మార్గం గుండా వెళుతూండగా వారికి ఎండలో స్పృహ తప్పి పడి వున్న ఒక వృద్ధ బైరాగి కనిపించాడు.

మిత్రులు దాపుల నున్న కొలనులో నుంచి నీళ్ళు తెచ్చి, ఆ బైరాగి ముఖం మీద చల్లారు. స్పృహలోకి రాగానే తాగడానికి నీళ్ళిచ్చారు. నీళ్ళు తాగి లేచి కూర్చున్న బైరాగి, మిత్రుల పరోపకార బుద్ధికి సంతోషించి, వారిని గురించిన వివరాలు అడిగి తెలుసుకుని, ‘‘నాయనలారా, మంచి మనసుతో ప్రయత్నిస్తే, భగవంతుడు మీకు మంచి భవిష్యత్తును ప్రసాదించగలడు. మీకు చెరొక మహిమగల రాయిని ఇస్తాను. వీటిని తగిన సమయంలో తగిన విధంగా ఉపయో గించుకుని ప్రయోజకులు కండి,'' అని దీవించి, రొండిన దోపుకున్న రెండు చిన్న రాళ్ళను తీసి వాళ్ళకిచ్చి తనదారిన వెళ్ళిపోయాడు. మిత్రులిద్దరూ ప్రయాణం కొనసాగించి, నాలుగో రోజు సాయంకాలానికి రాజధానీ నగరం శివార్లలోని ఒక సత్రం చేరి, ఇంత తిని నడుం వాల్చారు.

వాళ్ళకు కొద్ది దూరంలో ముగ్గురు వ్యక్తులు గుసగుసలాడుకోవడం వాళ్ళ చెవిన పడింది: ‘‘ఆహా, ఇన్ని నగలను ఈ జన్మలో చూడలేదు. వీటితో మన దరిద్రం వదిలిపోతుంది,'' అన్నాడు ఒకడు.

‘‘అవును, రాజుగారి ఖజానా కదామరి! ఒక్క రోజులోనే ఇంత సంపాయిస్తామనుకోలేదు,'' అన్నాడు రెండోవాడు. ‘‘తెల్లవారేసరికి సత్రం వదిలి పారిపోవాలి! భటుల కంటబడ్డామో, మన పని ఖాళీ,'' అన్నాడు మూడోవాడు. వాళ్ళ మాటలు మిత్రులిద్దరూ విన్నారు. దొంగతనానికి పాల్పడిన వాళ్ళు, రాజభటులకు పట్టుబడి శిక్ష అనుభవిం చక తప్పదనుకున్నాడు నందుడు.

విలువైన నగలని తెలియగానే సోముడి మనసు ఉత్సాహంతో ఉరకలు వేయసాగింది. వాటిని ఎలాగైనా కాజేయాలని ఆలోచించాడు. దొంగలు నిద్ర పోయాక, బైరాగి ఇచ్చిన మహిమగల రాయిని తీసుకుని నొసటకు తాకించి, ‘‘దొంగల సంచీలోని నగలన్నీ, నా సంచీలోకి రావాలి!'' అన్నాడు.

ఆక్షణమే ఆ నగలన్నీ సోముడి సంచీలోకి వచ్చేశాయి. సోముడు వాటిని సంతోషంగా తడివి చూసుకున్నాడు. నందుడు పడుకున్నాడే తప్ప, మేలుకుని దీన్నంతా ఓకంట కనిపెడుతూనే ఉన్నాడు.

అర్ధరాత్రి సమయంలో, ‘‘రాజుగారి ఖజానాను కొల్లగొట్టిన దొంగలు ఇక్కడే ఉన్నారని తెలిసింది,'' అంటూ రాజభటులు కొందరు అక్కడికి వచ్చారు. ఆ మాటలు విని నందుడు దిగ్భ్రాంతి చెందాడు. నిజమైన దొంగ కాక పోయినా, సోముడు భటులకు పట్టుబడక తప్పదని గ్రహించాడు. వెంటనే బైరాగి ఇచ్చిన రాయిని తీసి తన నొసటికి తాకిస్తూ, ‘‘సోముడి సంచీలోని నగలు, మళ్ళీ రాజుగారి ఖజానాకు చేరాలి,'' అని కోరుకున్నాడు.

రాజభటులు ప్రతి ఒక్కరినీ బెదిరిస్తూ, సోదా చేశారు. కాని ఒక్క నగ కూడా లభించలేదు. అంతలో నలుగురు భటులు వచ్చి, నగలు ఖజానాలోనే ఒక మూల పడి ఉన్నాయని చెప్పారు.

దొంగిలించిన నగలు మళ్ళీ ఖజానాకు ఎలా చేరాయా అని ముగ్గురు దొంగలూ విస్తుపోయారు. ‘‘మన మొట్టమొదటి దొంగతనమే ఇలా బెడిసికొట్టింది. తృటిలో శిక్ష తప్పింది. దొంగతనాల జోలికి వెళ్ళకుండా, ఎప్పటిలాగే కాయకష్టం చేసి మర్యాదగా బతుకుదాం,'' అని నిర్ణయించుకున్నారు.

మొదట అంతా అయోమయంగా కనిపించినప్పటికీ, ఆ తరవాత ఆపద నుంచి తనను కాపాడింది నందుడే అని గ్రహించిన సోముడు, ఇక ఈ జన్మలో దురాశకు లోనుకాకూడదనుకు న్నాడు. నందుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకు న్నాడు. మిత్రుడిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించిన నందుడు, బైరాగికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం