తాజా కథలు @ CCK

లోకంలో బుద్ధిమంతులెప్పుడూ గెలుస్తూనే ఉంటారు

2015-01-11 23:05:01 చిన్నారుల కథలు
ఒక చెరువులో రెండు చేపలు ఉండేవి. ఒకదాని పేరు శతబుద్ధి, మరొక దాని పేరు సహస్రబుద్ది, వీటితో ఏకబుద్ది అనే కప్ప స్నేహం చేసింది. ఒక రోజు కప్ప చెరువు ఒడ్డున కూర్చుని ఉంటే, చేపలు నీటిలో ఉండి కబుర్లు చెప్పుకుంటున్నాయి. ఆ సమయంలో ఇద్దరు జాలరులు అటు పక్కనుండి వెళుతూ చెరువులోకి చూశారు.

"ఈ చెరువులో చాలా చేపలున్నట్టున్నాయి. నీరు కూడా తక్కువగా ఉంది. రేపు మనం వలలతో వచ్చి చేపలు పట్టుకుందాం" అన్నాడు ఒక జాలరి. రెండో జాలరి అందుకు అంగీకరించాడు.

జాలరుల మాటలు విని ముగ్గురు మిత్రులు భయంతో వణికిపోయాయి.

"మిత్రమా... ఇప్పుడేం చేద్దాం ? మన ప్రాణాలకు ముప్పు రాబోతుంది. పారిపోవడమే శ్రేయస్కరం." అంది కప్ప కంగారుగా.

"అనుకున్నవన్నీ జరుగుతాయా? అయినా ఈ ప్రపంచంలో దుష్టుల మాటలు నెరవేరవు. మంచి వాళ్లకే చివరి విజయమని మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినలేదా? కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది. జాలరులు ఇక్కడికి రాలేరు. వచ్చినా భయపడకూడదు. నా తెలివితేటలతో మిమ్మల్ని రక్షిస్తాను" అని అంది సహస్రబుద్ధి.

"నిజమే. ఈ లోకంలో బుద్ధిమంతులెప్పుడూ గెలుస్తూనే ఉంటారు. గత చరిత్రలో దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంతో బలవంతులైన నందరాజులను చాణక్యుడు తన బుద్ధిబలం చేతనే అంతం చేయగలిగాడు. జాలరుల మాటలు విని భయపడి తాతలనాటి నుండి ఉంటున్న ఈ చెరువును విడిచి వెళ్ళటం మూర్ఖత్వం." అని వంతపాడింది శతబుద్ధి.

చేపల మాటలు విని కప్ప ఆలోచనల్లో పడిపోయింది. కొద్దిసేపటి తరువాత "మిత్రులారా... నేను ఏకబుద్ధిని. నాకు రకరకాల ఉపాయాలు, ఆలోచనలు రావు. నాకు పారిపోవడమే ఉత్తమంగా తోస్తుంది. అందుకే నేను ఇక్కడ్నుంచీ వెళ్లి పోవడానికి నిశ్చయించుకున్నాను." అని అంది కప్ప.

ఆ రోజు రాత్రే కప్ప ఆ చెరువు విడిచి అక్కడికి దగ్గరలోని మడుగుకు పారిపోయింది.

ఆ మరునాడు జాలరులు వలలతో వచ్చారు. వలలు విసిరి చేపలను పట్టుకున్నారు. శతబుద్ధి, సహస్రబుద్ధి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. కాని ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు అవి జాలరుల వలలకు చిక్కాయి.

మడుగులో దాగి ఉన్న కప్ప తన స్నేహితులకు పట్టిన గతిని చూసి విచారించింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం