తాజా కథలు @ CCK

జ్ఞానోదయం

2015-05-24 21:05:01 చిన్నారుల కథలు
ధర్మపురంలో భీముడు అనే పదేళ్ల కుర్రాడు ఉండేవాడు . అతడి చిన్నప్పుడే అమ్మానాన్నా చనిపోవడంతో మేనమామ ఇంట్లో పెరిగాడు . తిని తిరగడం తప్ప ఏ పనీ చేసేవాడుకాదు . అతడి సోమరితనాన్ని సహించలేక మేనమామ అతడిని ఓ రోజు ఇంటి నుంచి గెంటేశాడు . అతడి సంగతి తెలిసి ఎవరూ అతడిని చేరదీయకపోవడంతో పక్క ఊరికి వెళ్లి ఓ పెద్దమనిషికి తన జాలి కధను వినిపించాడు . ఆయన భీముడి పేరూ వివరాలూ అడిగి, భీముడు తన స్నేహితుడి కొడుకే అని తెలుసుకుని ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా అన్నం పెట్టించాడు . ఆ పెద్దాయన ఒక్కగానొక్క కొడుకూ పట్నంలో స్థిరపడ్డాడు . ముసలివాళ్లిద్దరూ ఉన్న ఎకరం పొలం చూసుకుంటూ గ్రామంలోనే ఉండిపోయారు . భీముడిని ఇంట్లో పెట్టుకుంటే ఆ పొలం పనుల్లో తనకు చేదోడు వాదోడుగా ఉంటాడని ఆశపడ్డాడు . అయితే, కొద్దిరోజుల్లోనే భీముడు సోమరిపోతనే విషయం గ్రహించాడు . అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి మనసొప్పక ఒక పధకం వేశాడు .
మర్నాడు పొలం నుంచి కూరగాయలు కోసుకురమ్మని ఒక పెద్ద గంప ఇచ్చి భీముడిని పొలానికి పంపాడు . భీముడు అతి కష్టం మీద గంపలో సగానికి కూరగాయలు కోసుకోచ్చాడు . పెద్దాయన భార్య కంచంలో సగం అన్నమే వడ్డించి ' నువ్వు తెచ్చిన కూరగాయలు అమ్మితే ఎంతో డబ్బు రాలేదు నాయనా సర్దుకో ' అంది . ఆకలి తీరక ఆ రాత్రి నిద్రేపట్టలేదు భీముడికి , మర్నాడు పొలానికి వెళ్లి గంప నిండా కూరగాయలు తీసుకొచ్చాడు . పెద్దావిడ ఎంతో సంతోషించి రెండు మూడు రకాల కూరలతో కొసరి కొసరి అన్నం వడ్డించింది . అన్నం తిని లేవబోతుంటే 'ఎంతో కష్టపడ్డావు నాయనా ఇది తీసుకో ' అంటూ ఓ గ్లాసు నిండా పాయసం కూడా అందించింది . ఆ రాత్రి హాయిగా నిద్రపట్టడమే కాదు కష్టపడితేనే కడుపు నిండుతుందని జ్ఞానోదయం కూడా అయింది భీముడికి .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం