తాజా కథలు @ CCK

మంచితనం

2015-02-05 21:23:47 చిన్నారుల కథలు
సునందుడు , శ్రీనివాసుడు ఒకే వీధిలో నివసించేవాళ్ళు. సునందుడు చిన్న వ్యాపారి . అందరితో మర్యాదగా మాట్లాడుతూ ఉన్నంతలో నలుగురికీ సాయపడుతూ మంచివాడిగా పేరుపొందాడు . శ్రీనివాసుడు రాజాస్థానంలో పని చేసేవాడు . దాంతో తెల్లవారితేచాలు రకరకాల పనులు నిమిత్తం పెద్దపెద్దవాళ్లు ఎందరో వచ్చి అతడిని కలిసేవారు . సునందుడు ఉన్నంతలో నలుగురికీ సాయపడుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడు . దాంతో సాయం కోసం అతడి ఇంటికీ ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు . అయితే శ్రీనివాసుడుకి ఇది ఎంతమాత్రం నచ్చేదికాదు . తను గొప్పవాడు కాబట్టి అందరూ తన దగ్గరకు రావచ్చుగానీ ఏ పదవిలేని సునందుడి దగ్గరకు వెళ్లడమేంటని అనుకునేవాడు . అంతేకాదు సునందుడి ఇంటికి వెళ్లినవారిని హేళనచేస్తూ మాట్లాడేవాడు . ఒకరోజు రాజా స్థానంలోని ఆనందుడనే ఉన్నతోద్యోగి సునందుడి గొప్పతనాన్ని శ్రీనివాసుడి ముందు మెచ్చుకున్నాడు . ఎప్పటిలాగే శ్రీనివాసుడు తనే గొప్పవాడిననీ సునండుడితో పోల్చి తనను తక్కువ చేయొద్దనీ అన్నాడు . దాంతో ఆనందుడు - నీకంటే సునందుడు ఎంత గొప్పవాడో నిరూపిస్తానుగానీ నువ్వు కొన్నిరోజులు మౌనంగా ఉండాలన్నాడు . సరేనని ఒప్పుకున్నాడు శ్రీనివాసుడు . శ్రీనివాసుడిని ఉద్యోగం లోంచి తొలగించినట్టుగా పుకారు పుట్టించాడు ఆనందుడు . దాంతో ఒక్కరుకూడా అతడిని కలవడానికి రాలేదు సరికదా దారిలో కనిపించినా మొహం చాటేసేవారు . అలా కొన్నిరోజులు గడిచేసరికి అసలు సంగతి అర్ధమై శ్రీనివాసుడికి కనువిప్పు కలిగింది . అందరూ తనను పదవినిబట్టే గౌరవిస్తున్నారనీ ఏ పదవీలేక పోయినా మాటతీరూ మంచితనంతో అందరి మన్ననలనూ పొందుతున్న సునందుడే తనకంటే గొప్పవాడనీ తెలుసుకున్నాడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం