తాజా కథలు @ CCK

చింటూ కల

2015-05-23 05:05:01 చిన్నారుల కథలు
చింటూ భలే అల్లరిపిల్లాడు . కానీ ఆ అల్లరి కూడా ముద్దుగా , ముచ్చటగా వుంటుంది .
ఒకరోజు చింటూ స్కూల్ కి ఆలస్యంగా వచ్చాడు .
"చింటూ !ఏంటి ? ఇంత ఆలస్యంగా వచ్చావు ?" అని అడిగారు మాస్టారు .
"మాస్టారూ! తెల్లవారుజామున నాకు ఒక డబ్బు సంచి దొరికింది " అని చెప్పాడు చింటూ .
"ఏమిటీ ? డబ్బు సంచా ?"అంటూ ఆశ్చర్యపోయారు మాస్టారు .
"అవును మాస్టారూ !డబ్బు సంచి దొరికింది . అందులో నుంచి కొంచెం డబ్బుతో మన క్లాసులో పిల్లలందరికీ స్వీట్స్ కొన్నాను " అని చెప్పాడు చింటూ .
"ఏమిటీ ? స్వీట్సా ?" అన్నారు మాస్టారు .
" అవును మాస్టారూ ! మీ కళ్లద్దాలు విరిగిపోయాయి కదా !మీకు కొత్త కళ్లద్దాలు కొన్నాను మాస్టారూ ! తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అంటారు కదా !అందువల్ల అమ్మకూ , నాన్నకూ గిఫ్ట్ లు కొన్నాను . ఇంకానేమో మన స్కూల్ దగ్గర కూర్చునే ముసలితాతకు చలికదా, అందుకని తాతకోసం దుప్పటి కొన్నాను " అని చెప్పాడు చింటూ .
" అబ్బో ! చాలా పనులు చేశావే . చింటూ ఇంతకీ నీ కోసం ఏమీ కొనుక్కోలేదా ?" అని అడిగారు మాస్టారు .
"కొనుక్కుందాం అనుకున్నాను మాస్టారూ ! మరేమో , ఇంతలో మా అమ్మ నా వీపు మీద ఒక్కటిచ్చి ' లేలే స్కూల్ కి టైమవుతోంది ' అన్నదండీ " అన్నాడు చింటూ . " ఓరి ....... అల్లరి పిడుగా ! అంటే ఇదంతా నీకొచ్చిన కలా ?" అంటూ ఆశ్చర్యపోయారు మాస్టారు .
----------------------------------------------------------------------------------------------------------

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం