తాజా కథలు @ CCK

సమయస్పూర్తి

2015-05-23 15:05:01 చిన్నారుల కథలు
ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది . తన కల్లబొల్లి మాటలతో అమాయక జంతువులను నమ్మించి వాటిని హాయిగా ఆరగించేసేది. ఒకరోజు ఏ జంతువూ కనిపించక ఆకలితో నకనకలాదసాగింది . ఆ సమయంలో అటుగా వస్తున్న కోళ్ల గుంపు ఒకటి దాని కంటబడింది . వాటిని చూడగానే దానికి ప్రాణం లేచివచ్చినట్లయింది .కోళ్లకు ఏమాత్రం అనుమానం రాకుండా మెల్లగా వెళ్లి ఆ గుంపులో కలిసిపోయింది . 'కొన్ని కోళ్లను చంపి ఇప్పుడే తినేస్తాను, మరికొన్నింటిని దాచుకుని వారం రోజులు పండగ చేసుకుంటాను ' అనుకుంటూ సంబరపడసాగింది. గుంపులో దూరిన నక్కను గమనించి కోళ్లు ఇక తమ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయమనుకున్నాయి . అయితే రెండు ముసలికోళ్లు మాత్రం నక్కను తరిమికొట్టడానికి చక్కని పధకం వేశాయి . దానిలో భాగంగా నక్కను సమీపించి  'నువ్వు మమ్మల్ని తినేస్తావని తెలుసు . అయితే మేము చచ్చిపోయేలోగా ఒకసారి దేవుడిని గట్టిగా ప్రార్ధించుకుంటాం, దయచేసి కాదనకు 'అంటూ వేడుకున్నాయి .
కోళ్లు దేవుడిని వేడుకుంటే తనకు పోయేదేమీ లేదుకాబట్టి అలాగే ప్రార్ధించుకోమంది నక్క . అంతే , కోళ్లన్నీ కలిసి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు బెదిరిపోతూ అరిచినట్టుగా గట్టిగా అరిచాయి . ఆ అరుపులు వినపడగానే పక్కనే పొలంలో పనిచేసుకుంటున్న వాటి యజమానికి అవి ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్టు అర్ధమై దుడ్డుకర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేశాడు .వచ్చీ రావడంతోనే అవి అలా బెదిరిపోవడానికి కారణం గుంపులోని నక్కే అని గ్రహించి దానికి గట్టిగా నాలుగు తగిలించాడు . ఆహరం సంగతి దేవుడెరుగు ప్రాణాలు దక్కినా చాలనుకుని నక్క అడవిలోకి పరుగు తీసింది .ఆపదలో చిక్కుకున్నప్పుడు కంగారుపడకుండా తెలివిగా కోళ్లు ప్రదర్శించిన సమయస్పూర్తే వాటి ప్రాణాలను కాపాడింది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం