తాజా కథలు @ CCK

స్వయంకృషి

2015-05-30 21:05:01 చిన్నారుల కథలు
సిరిపురానికి చెందిన సదానందుడు పట్టణంలో ఉన్నత విద్యాభ్యాసం చేసి గ్రామానికి తిరిగి వచ్చాడు . అతడు ఉన్నత విద్యావంతుడు కావడంతో ఏ సమస్య వచ్చినా ప్రజలంతా అతడినే సంప్రదించేవారు. దాంతో తాను గొప్పవాడిననే భావం అతడిలో బాగా పెరిగిపోయింది . పైగా అన్నీ తెలిసిన తనలాంటివాడు ఒకరికింద పనిచేయడం అవమానకరం కాబట్టి ఏ పనీ చేసే వాడుకాదు . తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులు కూడా బాగా ఉండటంతో స్నేహితులతో విందు వినోదాల్లో మునిగితేలుతూ డబ్బును జల్సాగా ఖర్చుచేసేవాడు.
ఒకరోజు సదానందుడు స్నేహితులతో కలిసి ఊరంతా తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో చెప్పు తెగిపోయింది . చెప్పులు కుట్టే సింగడి దగ్గరకు వెళ్లి చెప్పు కుట్టించుకుని వంద రూపాయల నోటు ఇచ్చాడు . సింగడు చిల్లర తిరిగి ఇవ్వబోతుంటే .........'జేబులో నోట్లు తప్ప చిల్లర పెట్టుకునే అలవాటు నాకు లేదు . ఆ చిల్లరతో హాయిగా వారం రోజులపాటు జల్సా చేసుకో ' అంటూ ఎంతో నిర్లక్ష్యంగా చెప్పాడు సదానందుడు . 'అక్షరంముక్క రాకపోయినా నేనెప్పుడూ ఇతరుల సొమ్ముకు ఆశపడలేదు . ఇలా కష్టపడి బతకడంలోనే గౌరవం ఉంది ' అంటూ చిల్లర తిరిగి ఇచ్చేశాడు . సింగడు ఉద్దేశపూర్వకంగా సదానందుడిని విమర్శించాలనే ధ్యేయంతో ఏమీ అనకపోయినా ఆ మాటలకు సదానందుడి మనసులో అలజడి మొదలైంది . చదువులేనివాడే ఒకరిమీద ఆధారపడకుండా స్వయంకృషితో జీవిస్తుంటే తనలాంటి విద్యావంతుడు తండ్రి మీద ఆధారపడటం ఎంతవరకూ సబబని తీవ్రంగా ఆలోచించాడు . ఆ తర్వాత కొద్దికాలానికే ఉద్యోగంలో చేరి కష్టపడి సంపాదిస్తూ నలుగురికీ ఆదర్శంగా మేలగసాగాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం