తాజా కథలు @ CCK

చిట్టి బుర్రలో గట్టి ఆలోచన

2015-05-04 01:05:01 చిన్నారుల కథలు
కమలమ్మకు చిట్టి అనే కూతురు వుండేది. చిట్టి చిన్న పిల్లగా వున్నప్పుడే భర్త పాము కాటుతో చనిపోవడంతో కమలమ్మ చిట్టికి తానే తల్లి తండ్రీ అయి పెంచసాగింది .
చెవి కమ్మలు అమ్మి ఒక కుట్టు మిషను కొనుక్కుంది కమలమ్మ .
బట్టలు కుట్టి, ఆ వచ్చే డబ్బుతో చిట్టిని స్కూల్లో చేర్చి చదివించసాగింది. చిట్టి తనలాగా పేదరికం అనుభవించకూదదు . బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలి అనుకునేది కమలమ్మ .
చిట్టి ఆరోతరగతిలోకి వచ్చింది .కమలమ్మకు హఠాత్తుగా అనారోగ్యం చేసి మిషను కుట్టడం కష్టం అయిపోయింది .
ఒకరోజు ఇంటి యజమాని అద్దె అడగటానికి వచ్చాడు ." రెండు నెలలుగా అద్దె ఇవ్వలేదు , ఇలాగైతే ఇల్లు ఖాళీ చేయండి " అంటూ గట్టిగా అరవసాగాడు. ఆరోగ్యం కాస్త బాగుపడగానే మళ్లీ మిషను కుట్టి ఎలాగైనా అద్దె ఇస్తానంది కమలమ్మ .
అంతలో చిట్టి వచ్చి తన స్కూల్ బ్యాగ్ లో నుంచి డబ్బులు తీసి ఇంటి యాజమానికి ఇచ్చి "ఇదుగో మీ అద్దె " అంది .
కమలమ్మ ఆశ్చర్యపోయి , "డబ్బు ఎక్కడిది ? దొంగ తనం చేశావా ?" అని అడిగింది కోపంగా .
అందుకు చిట్టి "అమ్మా! నువ్వు నాకు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోడానికి డబ్బులు ఇస్తుంటావు కదా ? నేను టెక్స్ట్ బుక్స్ కొనుక్కోకుండా ఆ డబ్బులు కూడబెట్టాను " అంది .
"పుస్తకాలు కొనుక్కోకపోతే ఎలా చదువుకుంటావే " అన్నది కమలమ్మ .
"అమ్మా !చెపుతాను విను , టెక్స్ట్ బుక్స్ కొనాలంటే ఒక్కొక్కటీ 60,80 రూపాయల వరకూ అవుతాయి . నేను 20 రూపాయల నోట్ బుక్స్ కొనుక్కుని నా క్లాస్ మేట్స్ దగ్గర టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుని అవన్నీ నోట్ బుక్ లో రాసుకున్నాను. అలా డబ్బు ఆదా అయింది " అని చెప్పింది చిట్టి .
చిట్టి బుర్రలో గట్టి ఆలోచనకు కమలమ్మ ఆశ్చర్యపోయింది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం