తాజా కథలు @ CCK

మంచితనం

2015-03-27 09:05:02 చిన్నారుల కథలు
రంగాపురానికి చెందిన గోపయ్య వడ్డీ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు .ఏ పని చేయాలన్నా అందులో తనకు వచ్చే లాభం గురించి మాత్రమే ఆలోచించేవాడు . అంతేకాదు తనలాగే లాభం లేకుండా ఎవరూ ఏ పనీ చెయరనీ నమ్మేవాడు .
ఒకరోజు పట్నంలో పనులు ముగించుకుని తిరిగి వస్తూ రోడ్డు పక్కనే ఉన్న లోతైన గుంటలో పడిపోయాడు. రక్షించండని గోపయ్య ఎంత మొత్తుకున్నా అటూ ఇటు వెళుతున్న వాళ్లు వినిపించుకోనట్టే వెళ్ళిపోయారు . పొరపాటున కూడా ఎవరికీ సాయంచేయని గోపయ్య నైజం అందరికీ తెలిసుండ టంతో అతడికి సాయం చేయడానికి ఊరివాళ్లు ఎవరూ ముందుకురాలేదు . రాంబాబు అనే యువకుడు మాత్రం కష్టపడి గోపయ్యను పైకిలేపి , నీళ్లు తాగించి సపర్యలు చేశాడు .
ముక్కూమొహం తెలియని తనకు సాయపడ్డ ఆ యువకుడికి గోపయ్య ఎంతగానో కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు . దానికి రాంబాబు " నేనేమీ ఘనకార్యం చేయలేదు . సాటి మనిషిగా మీకు సాయపడ్డాను అంతే . గోపయ్యకు ఇలా కావాల్సిందేనంటూ మీ ఊరి వాళ్లంతా అనుకోవడం నేనూ విన్నాను . పైగా నేను కూడా వాళ్లలాగే నాకెందుకొచ్చిన గొడవని వెళ్లిపోదామనే అనుకున్నాను . కానీ నేనూ అలాగేచేస్తే మీ మనస్తత్వంలో ఎప్పటికీ మార్పురాదు .

మనుషులందరూ మీలాగే ఆలోచిస్తారనే నిర్ణయానికి వచ్చేస్తారు . అందుకే మీ ఆలోచనల్లో కొంచెమైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మీకు సాయం చేశాను అన్నాడు . అతడి మాటల్లోని నిజాన్ని గ్రహించి తప్పు తెలుసుకున్న గోపయ్య అప్పటినుంచీ శక్తిమేరకు సాటివారికి సాయపడుతూ అందరితో స్నేహంగా ఉండసాగాడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం