తాజా కథలు @ CCK

పరమ పిసినారి నక్క

2015-06-12 13:05:01 చిన్నారుల కథలు
అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో, ఏ చెత్తకుండీచాటునో కూర్చుని తినచ్చు కదా! ఊహూ... తోటి నక్కలు చూస్తే తమకూ కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా నక్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది.

ఊరవతల ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి. దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర్నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి. అందుకని అవి నక్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టాయి.

‘‘నక్క మామా! నక్క మామా! బాగున్నావా? ఊరిలో నుంచి వస్తున్నావు, ఏమిటి సంగతులు?’’ అని ఒక కాకి అడిగింది. నక్క ఏమీ లేవన్నట్టు తల అడ్డంగా ఊపింది.‘‘నువ్వు మేలుజాతి నక్కలా ఉన్నావు. నీలాంటి నక్కను ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు. నీతో స్నేహం చేయాలని ఉంది. చేస్తావా?’’ అంటూ పొగిడాయి. కాకుల పొగడ్తలకు పొంగిపోయిన నక్క ‘సరే’ అని తలూపింది.

వెంటనే రెండు కాకులూ సంతోషంగా అరుస్తూ నక్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి. ఒక కాకి నక్క వెనుకకు, మరొక కాకి నక్క ముందుకు చేరాయి. వెనుకనున్న కాకి హఠాత్తుగా నక్క తోక పట్టి లాగింది. ఉలిక్కిపడిన నక్క మాంసపు ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో ముందు వైపు ఉన్న కాకి ఆ మాంసపు ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. పనైపోయిందిగా, ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెండూ చెట్టు మీద కూర్చుని మాంసం ముక్కను పంచుకుని తిన్నాయి. పాపం ఆ నక్క నోటమాటరాక అలా చూస్తూ ఉండిపోయింది.

నీతి :

పొగడ్తలకు లొంగిపోయినవారు ఎప్పటికైనా ఇబ్బందులపాలు కాక తప్పదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం